ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళా నిన్న ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భక్తులు మహాకుంభమేళాకు వచ్చి స్నానమాచరించారు. తొలిరోజే దాదాపు 60 లక్షల మంది భక్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 45 రోజుల పాటు ఈ మహాకుంభమేళా జరగనుంది. దీనికి దాదాపు 40 కోట్ల మంది హాజరవుతారని అంచనా. దీనికోసం యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మహా కుంభమేళాతో యూపీ ప్రభుత్వానికి దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని అంచనా. ఈ క్రమంలోనే వ్యాపారం, ఆర్థిక కార్యకలాపాలు మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతున్నాయి. మహాకుంభమేళాకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కనీసం రూ.5 వేలు ఖర్చు పెడతారని అంచనా.
ఇప్పటికే హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, తాత్కాలిక లాడ్జీలన్నీ ముందస్తు బుకింగ్స్ 45 రోజులకు సరిపడా జరిగాయి. కేవలం వీటి ద్వారా 40వేల కోట్ల రూపాయల ఆదాయం అలాగే ప్యాకేజీ ఫుడ్, నీరు, బిస్కెట్లు, జ్యూస్‌లు, భోజనం వంటి వాటితో మరో రూ.20వేల కోట్ల వ్యాపారం జరగనుంది. ఇక పూజాసామగ్రి, ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వాటితో మరో రూ.20వేల కోట్ల లావాదేవీలు… టాక్సీలు, సరకు రవాణా సేవలతో రూ.10వేల కోట్లు, టూరిస్టు గైడ్‌లు, ట్రావెల్ ప్యాకేజీల వంటి వాటితో రూ.10వేల కోట్ల వ్యాపారం.. మెడికల్ క్యాంపులు, ఇతర ఔషధాలతో రూ. 3వేల కోట్లు, ఈ టికెటింగ్, డిజిటల్ పేమెంట్లు, వైఫై, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో రూ.1000 కోట్లు.. ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలతో మరో 10వేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది.