గురువాయూర్‌కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడి ఆలయాలు దేశంలో చాలానే ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాధాన్యత కలిగినది.. గురువాయూర్. కన్నయ్య భూలోకంలో వెలసిన దివ్యక్షేత్రంగా, భూలోక వైకుంఠంగా దీనిని భక్తులు భావిస్తారు. ఈ మహాక్షేత్రం వేల సంవత్సరాలుగా భక్తులతో పూజలందుకుంటోంది. గురువాయూర్‌లో శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శించుకుంటే మోక్షం సిద్దిస్తుందని నమ్మకం. పరబ్రహ్మే శ్రీకృష్ణ రూపంలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారని ఆలయ అర్చకులు చెబుతారు. అసలు గురువాయూర్‌కు ఆ పేరెలా వచ్చిందో తెలుసుకుందాం.

దేవతల గురువు బృహస్పతి, వాయు భగవానుడు కలసి శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా స్థలపురాణం చెబుతోంది. దీనిని దక్షిణ ద్వారకగా అభివర్ణిస్తారు. ఇక్కడి స్వామివారి మూలవిరాట్‌‌ను పడ అంజనం అనే మిశ్రమంతో తయారు చేశారట. ద్వాపర యుగం చివరి రోజుల్లో సాక్షాత్తు శ్రీకృష్ణభగవానుడే తన విగ్రహాన్ని తయారు చేసి శిష్యుడైన ఉద్దవునికి ఇచ్చాడట. ద్వాపర యుగాంతంలో యావత్ ప్రపంచం నీటమునిగిందని చెబుతారు. ఆ సమయంలో దేవతల గురువు బృహస్మతి కన్నయ్య విగ్రహాన్ని గురువాయూర్‌లో ప్రతిష్టించాడట. గురువు విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్న సమయంలో వాయువు తన ప్రభంజనంతో సముద్రాన్ని ఉప్పొంగించాడు. ఈ మహత్‌ కార్యంలో గురువు, వాయువు కలిసి పాల్గొనడంతో గురువాయూర్‌ అనే పేరు వచ్చింది.

Share this post with your friends