తిలకాష్ఠమహిషబంధనం అంటే ఏంటో తెలుసా?

ఒకసారి శ్రీకృష్ణదేవ రాయల ఆస్థానికి ఒక సుప్రసిద్ధ కవీశ్వరుడు విచ్చేశాడు. అతడు మహారాజుతో “ప్రభూ! నేను నన్నయ వేముడనే రాజును గూర్చి ఒక పెద్ద కావ్యము రచించాను. అయితే ఆ కావ్యాన్ని అర్థం చేసుకోగల కవి కానీ, పండితుడు కానీ నాకింత వరకూ ఏ రాజు వద్దా కనిపించలేదు. మీరు సాహితీ సమరాంగణ సార్వభౌములు! మీ ఆస్థానంలో ‘అష్టదిగ్గజ కవు’లని ఎనిమిది మంది మహనీయులున్నారని తెలిసి నేనిక్కడికి వచ్చాను. సభ ఏర్పాటు చేయండి. నా పద్యాలను వ్యాఖ్యానించగల వాళ్లను చూపించండి. సంతోషిస్తా’’ అని విన్నవించాడు.

తన ఆస్థానంలోని కవులు ఎందుకూ పనికిరాని వాళ్లని ఋజువు చేయాలని అతడు సంకల్పించుకొన్నట్లు రాయలు గుర్తించారు. అయినా తన అష్టదిగ్గజాలు, అందులోనూ రామకృష్ణ కవి అసాధారణ ప్రతిభగలవాడని రాయలుకు తెలుసు. కాబట్టి సభ ఏర్పాటు చేశారు. ఆ మహాకవి ఇలా చదవడం మొదలుపెట్టాడు…

“రాజనందనరాజ రాజాత్మజులు సాటి
తలప నన్నయవేమ ధరణిపతికి,
రాజనందనరాజ రాజాత్మజులు సాటి
తలప నన్నయవేమ ధరణి పతికి
భావభవభోగ సత్కళా భావములను,
భావభవభోగ సత్కళా భావములను” – అని చదువగానే పెద్దన, తిమ్మన మొదలైనవాళ్లందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు. రాయల వారికి కూడా ఈ పద్యంలోని విషయం, విశేషం అర్థం కాలేదు. అందరూ ఇలా ఆందోళన పడుతుండగా తటాలున రామకృష్ణకవి లేచి, “కవివర్యా! నేనుకూడా ఒక మహాకావ్యం వ్రాశాను. దానిపేరు.. “తిలకాష్ఠ మహిష బంధనం” అంటూ ఎర్రటి పట్టుబట్టలో దాచిన ఒక గ్రంథం లాంటిదాన్ని చూపాడు.
ఎన్నో గ్రంథాలు చదివి ఆపోశన పట్టిన ఆ కవీశ్వరునికి ఈ కావ్యం పేరు వినగానే ముచ్చెమటలు పోశాయి. ఈ పేరు ఎక్కడా విన్నదికాదు. “ఇందులోని ఒకపద్యం వినండి…” అంటూ రామకృష్ణుడు –

“మేకతోకకుమేక తోకమేకాతోక
మేకతోకామేక తోకమేక” –

అంటూ నాల్గుసార్లు చదివినపాదాలే మళ్లీ మళ్ళీ చదివి,

చివరికి –
“మేకతొకతోక మెకమేక తోకమేక

మేకతొకతోక మెకమేక తోకమేక

మేకతొకతోక మెకమేక తోకమేక

మేకతొకమేక తొకతోక మేకమేక”

అని గంభీరంగా చదివాడు.

ఆ వచ్చిన మహాకవి విని “ప్రభూ! ఈ పద్యం చాలా ప్రౌఢంగా ఉంది. కావ్యం పేరే మరీ గంభీరంగా, జటిలంగా ఉంది. ఈ రాత్రికి ఆలోచించి, రేపు చెపుతా”నని అతడు ఆ రాత్రికి రాత్రే నగరం వీడి, పారిపోయాడు. మరుసటి ఉదయం రాయలూ, కవులూ అందరూ రామకృష్ణుని యుక్తిని మెచ్చుకొని, “ఆ కావ్యం ఏమిటయా! మాకు తెలీకుండా ఎప్పుడు వ్రాశావు?” అని అడిగారట. “నా బొంద! కావ్యమా? పాడా? ‘తిలకాష్ఠం – మహిష బంధనం’ (నువ్వుకర్ర – బర్రెను కట్టే పలుపుత్రాడు) అని పట్టుబట్టల్లో నుంచి వాటిల్ని తీసి, అందరికీ చూపించాడట రామకృష్ణుడు!

Share this post with your friends