
రాతిలో నిలిచిన హిందూ మహా వైభవంగా ఆంగ్‌కోర్ వాట్‌ను పేర్కొంటారు. కంబోడియా నేలపై విస్తరించిన ఆంగ్‌కోర్ వాట్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక పురాతన ఆలయం కాదు. ఇది హిందూ ధర్మం, వైష్ణవ ఆరాధన, ఖ్మేర్ సామ్రాజ్య శిల్పవైభవం, భారతీయ విశ్వదర్శనం ఆగ్నేయాసియాలో ఎంత లోతుగా వికసించాయో తెలియజేసే మహత్తర చారిత్రక సాక్ష్యం. 12వ శతాబ్దంలో ఖ్మేర్ చక్రవర్తి సూర్యవర్మన్ II కాలంలో నిర్మించబడిన ఈ మహాలయం ప్రారంభంలో శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. సుమారు 402 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆలయ సముదాయం అప్పటి స్థపత్యం, జలవ్యవస్థ, రాతి నిర్మాణ నైపుణ్యం, శిల్పకళ ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నాయో చూపిస్తుంది.
మధ్యలోని ఐదు ప్రధాన శిఖరాలు మేరు పర్వతాన్ని ప్రతీకాత్మకంగా సూచిస్తాయని పరిశోధకులు భావిస్తారు. ఆలయాన్ని చుట్టుముట్టిన విశాల అగడ్తను హిందూ విశ్వ నిర్మాణ భావనలోని మహాసముద్రానికి ప్రతీకగా వ్యాఖ్యానిస్తారు. అంటే ఆంగ్‌కోర్ వాట్ నిర్మాణం కేవలం అందం కోసం కాదు… హిందూ విశ్వదర్శనాన్ని రాతిలో నిర్మించిన మహత్తర స్థపత్య రూపకల్పన. ఆలయ గోడలపై చెక్కబడిన శిల్పాలను పరిశీలిస్తే మన పురాణ ప్రపంచమే కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. క్షీరసాగర మథనం… రామాయణ ఘట్టాలు… మహాభారత దృశ్యాలు… విష్ణుమూర్తి రూపాలు… దేవతలు… అప్సరసలు… రాజసభలు… సైన్యాలు… ఇవి కేవలం అలంకారాలు కాదు. ఆ కాలపు ధర్మం, రాజ్యవ్యవస్థ, కళ, పురాణచింతన, సామాజిక జీవనాన్ని రాతిలో భద్రపరిచిన చారిత్రక ఆధారాలు.
