
హిందూమతంలో దక్షిణ భారతదేశంలో భగవంతుని గురించి ప్రతిపాదించబడిన మూడు ముఖ్యమైన సిద్ధాంతాలను త్రిమతాలు అంటారు. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులు అంటారు.
అద్వైతం లేదా స్మార్తం
విశిష్టాద్వైతం లేదా వైష్ణవం
ద్వైతం లేదా మధ్వం
అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము అనే పదాలను సిద్ధాంతాలకూ స్మార్తం, వైష్ణవం, మధ్వం అనే పదాలను ఆచారాలకూ ఎక్కువగా వాడుతారు. మూడు సిద్ధాంతాలకు మౌలిక కారణాలు ఏంటంటే.. వేదముల ఉత్తరభాగము ఆధారంగా వెలువడినది ఉత్తర మీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనమనీ, బ్రహ్మసూత్రములనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తుల నుంచి ఉద్భవించాయి. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధాన్ని తెలియజేస్తుంది. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. ఆ విధంగా అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము – అనే మూడు ప్రముఖమైన సిద్ధాంతములు ఏర్పడ్డాయి.
