
భారతదేశం ఎన్నో వింతలూ విశేషాలకు నెలవు. మన దేశానికి వచ్చిన బ్రిటీషర్లు మన దేశ సంపదనంతా దోచుకెళ్లారు. పుణ్యక్షేత్రాలను సైతం కొల్లగొట్టారు. అలాంటిది మన దేశంలో ఒక బ్రిటీష్ అధికారి ఒక దేవాలయాన్ని నిర్మించారు. సాక్షాత్తు పరమ శివుడిపై విశ్వాసం ఉంచిన ఆ అధికారి శివాలయాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడు. రెండు వందల ఏళ్ల పాటు భారత్‌ను పరిపాలించిన బ్రిటీషర్లు.. మన దేశంలో ఎన్నో చర్చిలు నిర్మించారు. హిందూ దేవాలయాలను కొల్లగొట్టారు. ఒకే ఒక్క దేవాలయాన్ని మాత్రం నిర్మించారు. అదెక్కడుందో ముందుగా తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో ఉందా శివాలయం. దీనిని 1880లో లెఫ్టెనెంట్ కల్నల్ మార్టిన్ పునర్నిర్మించారు. భారతదేశంలో ఒక ఆంగ్లేయుడు నిర్మించిన ఏకైక ఆలయంగా ఇది చరిత్రకెక్కింది. అప్పట్లో ఈ ఆలయం శిథిలావస్థలో ఉండేదట. దీనిని కల్నల్ మార్టిన్ దంపతులు పునర్నిర్మించారు. దీనికి కారణం.. కల్నల్ మార్టిన్ భార్య ఈ శివయ్యకు మొక్కుకోవడం వల్లనే ఆమె కోరిక నెరవేరిందని చెబుతారు. ఆమె మొక్కు కారణంగా కల్నల్ మార్టిన్‌ను సాక్షాత్తు శివయ్యే యుద్ధం నుంచి కాపాడాడని ఆమె నమ్మకం. కల్నల్ మార్టిన్ కూడా అదే చెబుతారు.
