గోవా అనగానే మనకు గుర్తొచ్చేవి బీచ్.. ప్రకృతి అందాలు.. అందుకే జనాలు ఎంజాయ్‌మెంట్‌ను వెదుక్కుంటూ గోవా వెళుతుంటారు. అయితే గోవా ఆధ్యాత్మికంగానూ విశిష్టమైనదని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ చిన్న రాష్ట్రంలో దేవాలయాలకు కొదువ లేదు. ఇక్కడ ఆలయాలే కాదు.. ఆశ్రమాలు సైతం ఉన్నాయి. ఆది శంకరుల గురువు గోవిందపాదులకు గురువైన గౌడపాదచార్యుల ఆశ్రమం ఇక్కడే ఉంది. అలాగే ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతిష్టించిన శ్రీమంగేశి మందిరం ఉంది.
ఇక్కడి జువారి నది ఒడ్డున పురాణ కాలంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు. అనంతరం ఈ ప్రాంతాన్ని పోర్చుగీసువారు ఆక్రమించి ఆలయ నిర్మాణం గావించారు. అనంతర కాలంలో అక్కడి శివలింగాన్ని కొందరు భక్తులు సమీపంలోని ప్రియల్‌కు తరలించి.. నాలుగు శతాబ్ధాల పాటు ఇక్కడే పూజలు నిర్వహించారు. ఆ తరువాతనే ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. 18వ శతాబ్దంలో మరాఠా సైన్యాధికారి రామచంద్ర సుక్తాంకర్ ఆలయాన్ని పునర్ నిర్మించి దానిలో శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా దీపస్తంభం నిలుస్తుంది.