
సంకట హర చతుర్థి పేరులోనే ఉందిగా.. సకల ఇబ్బందులను తొలగిస్తుందని.. దీని వ్రత విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యోదయమవక ముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమూ, నిత్య పూజ పూర్తి చేసుకోవాలి. తరువాత గణేశుని తలచుకొని ఆరోజు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించడానికి సంకల్పించుకోవాలి. పగలంతా ఉపవాసం గానీ, అల్పాహారంతోగానీ ఉండాలి. నిష్ఠతో గడపాలి. సాయంత్రమవగానే స్నానం చేయాలి. మట్టితో గణేశుని ప్రతిమ చేసి గానీ, పసుపుతో మూర్తిని చేసిగానీ గణేశుని అందులోనికి రమ్మని ప్రార్థించాలి. ధూప, దీపములూ, పుష్పాలంకరణ చేసి, తప్పనిసరిగా గరిక చిగుళ్ళతో పూజించాలి. మూడు ఐదు లేదా ఏడు ఆకులు గల గరికలను, యిరవయ్యొకటి లేదా అంతకంటే ఎక్కువగానీ కనీసం ఒక్కటైనాగానీ సమర్పించాలి.
కొంతసేపు ఏదైనా వినాయక మంత్ర జపం చేయాలి. గణేశునికి నైవేద్యం సమర్పించి, హారతినివ్వాలి. చంద్రోదయ సమయానికల్లా ఈ పూజ అంతటినీ ముగించాలి. చంద్రుడిని చూసి, చంద్రునికీ చతుర్థీ తిథికి నమస్కరించి అర్ఘ్యమివ్వాలి. తరువాత పూజా మందిరంలోకి వెళ్ళి గణేశుని, “సంకటాం మాం నివారయ” (నా సంకటములను తొలగించు) అని వేడుకుని, నమస్కరించి అర్ఘ్యమివ్వాలి. బ్రహ్మచారికి భోజనం పెట్టి , తరువాత తానూ భుజించాలి.
రాత్రంతా గణేశుని స్మరిస్తూ, నిద్రపోవాలి. అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని, ఒక్కఏడాది అయినా ఆచరిస్తే చాలు మన అదృష్టం వరిస్తుంది. చంద్రోదయ సమయంలో చంద్రునికి, చతుర్థీ తిథికి, గణేశునికి నమస్కరించి భోజనం చేయండి. ఈ రోజు శ్రీ మహాగణపతి అనుగ్రహం కొరకు అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం. గణేశానుగ్రహం తప్పక కలుగుతుంది.
