వేసవిలో రాయల పానీయం గురించి తెలుసా?

వేసవిలో రాయల పానీయం గురించి తెలుసా? ఆ స్పెషల్ పానీయం ఏంటా అనుకుంటున్నారా? అదేంటంటే.. వేసవికాలంలో ఇంటికి వచ్చిన అతిథులకు విష్ణుచిత్తుడు వడ్డించిన వంటకాలను రాయలవారు ఆముక్తమాల్యద కావ్యంలోని ఓ పద్యంలో వివరించారు. ఆ పద్యం ఏంటంటే..

తెలి నులివెచ్చ యోగిరము దియ్యని చారులు దిమ్మనంబులున్
బలుచని యంబళు ల్చెరకు పాలెడనీళ్ళు రసావళు ల్ఫలంబులును
సుగంధి శీత జలముల్వడ పిందెలు నీరు జల్లయు
న్వెలయగ బెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్

నులివెచ్చగా ఉన్న తెల్లన్నం అంటే వరి అన్నం. తేలికగా అరుగుతుంది. వడకొట్టదు. తియ్యని చారు అంటే, చింతపండు వెయ్యని రసం. తమిళనాడులో దీన్ని ‘టిక్కాచారు’ అంటారు. తేమనం అంటే మజ్జిగ పులుసు. బియ్యప్పిండి, కొబ్బరి, అల్లం, మిరియాలు, వాము వగైరాలను పాలతో ముద్దగా కలిపి చిన్న ఉండలుగా చేసి మరుగుతున్న మజ్జిగపులుసులో వేసి ఉడికిస్తే అవి ‘తిమ్మనలు’ కావచ్చు. అన్నంలో తినటానికి బావుంటాయి. వేసవిలో చలవనిస్తాయి.వరి లేదా జొన్న నూకల ను పులియబెట్టి తయారు చేసేవి కూడా ఉన్నాయి. ఇవి వడదెబ్బ తగలకుండా చేస్తాయి.చెరకు రసం. వేసవి తాపానికి విరుగుడు పానీయం ఇది.

బాగారసం నిండిన తియ్యమామిడిపండ్లు. ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క లాంటి సుగంధ ద్రవ్యాల పొడిని నీళ్లలో వేసి కాచి, చల్లార్చి కుండలో పోసిన చల్లని నీళ్లు. జీరావాటర్, ధనియావాటర్, దాల్చినివాటర్, వాంవాటర్ లాంటివి ఈనాటికీ తాగే అలవాటుంది. వడదెబ్బకు విరుగుడు పానీయాలివి.లేతమామిడి పిందెలు. వగరుగా ఉంటాయి వీటిని తరిగి ఉప్పు వేసి ఊరబెట్టి, మిరియాలపొడితో అన్నంలో తింటారు. వడపిందెలు వడకొట్టకుండా కాపాడతాయి.బాగా చిలికి 3 రెట్లు నీళ్లు కలిపి కనీసం 5-6 గంటలు కదల్చకుండా ఉంచిన మజ్జిగ నీటిని ‘నీరుచల్ల’ అంటారు. దీన్నిండా ఉపయోగపడే బాక్టీరియాలు ఉంటాయి. చలవనిచ్చి, పేగులను సంరక్షిస్తాయి. ఉత్తమ వేసవి పానీయం.

చందనచర్చ అంటే మంచిగంథం పూసి వడదెబ్బ నుండి సేదతీర్చి, అప్పుడు భోజనం పెట్టేవాడన్నమాట. ఇంటికొచ్చిన అతిథి షుగరు రోగి అయినా, బలవంతంగా స్వీట్లు పెట్టి, ఏం పర్వాలేదు, ఇంకో మాత్ర అదనంగా వేసుకోండని ఉచిత సలహాలిచ్చే తరహా ‘అతిమర్యాదలు’ విష్ణుచిత్తుడు చేయలేదు. కాలానికి తగ్గ ఆహార పదార్థాలను ఇంపుగా వడ్డించే వాడాయన. కావ్యాలు చదివితే కలిగే ప్రయోజనం ఇదే! చెయ్యవలసినవి, చెయ్యకూడనివి రెండూ తెలుస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు ఈ పద్యంలో వేసవిలో వడ దెబబ్ కొట్టని ఆహార పదార్ధాల పట్టిక ఇచ్చాడు.

Share this post with your friends