అమ్మవారి అవతారాల్లో కాళికావతారానికి ప్రాధాన్యత ఎక్కువ. కాళికా రూపం విశిష్టత గురించి మీకు తెలుసా? కాళిక రూపం విశ్వంలోని బ్రహ్మండ శక్తికి ప్రతిరూపమని అంటూ ఉంటారు. ముదురు నీలం లేదా కృష్ణ వర్ణంలో కాళికాదేవి దర్శనమిస్తూ ఉంటుంది. అంతేకాకుండా పెద్ద శిరోజాలను విరబోసుకుని కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని ముక్తకేశి అని కూడా అంటారు. ఆమె ఒక్కొక్క శిరోజాన్ని ఒక్కో జీవిగా పరిగణిస్తూ ఉంటారు. ఎర్రని నాలుకను నొక్కి పడుతున్న దంతాలో ఆమె ఉగ్ర రూపిణిగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వామ హస్తంతో ఖడ్గాన్ని.. తెగిన మానవ శిరస్సును పట్టుకుని కనిపిస్తుంది.
కాళికాదేవి త్రినయని. ఆమె మూడు కన్నులు త్రికాలజ్ఞతకు ప్రతీకలని చెబుతారు. అమ్మవారు ఒక పక్క బీషణా ఆకృతిలనూ మరోపక్క కరుణామయి గానూ దర్శనమిస్తూ ఉంటుంది. సంతానం పట్ల అమ్మవారికి మక్కువ ఎక్కువట. కాళిక ముండమాల ధరించి కనిపిస్తుంది. దీనిలో యాభై శిరస్సులు ఉంటాయి. అవి సంస్కృత భాషలోని యాభై అక్షరాలను సూచిస్తూ ఉంటాయంటారు. అవే భాషకు, శబ్దానికి పునాది అని చెబుతారు. అంతేకాకుండా వెల్లకిలా పడుకున్న శివునిపై నిలబడినట్టుగా కాళికాదేవిని చిత్రీకరిస్తారు. సృష్టిలో సమస్తానికి ఆమె మూలమని అంటారు.