
వజ్రనాభుడనే రాక్షసుడిని బ్రహ్మదేవుడు తన చేతిలోని తామరపువ్వును ఆయుధంగా మార్చి సంహరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తామర పువ్వు నుంచి మూడు రేకులు భూమిపై పడి అవి జ్యేష్ట పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అనే మూడు సరస్సులుగా మారాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు.. ఆ పుష్కర్ ప్రాంతంలో లోక కల్యాణం కోసం యజ్ఞం చేయాలని సంకల్పించాడట. తన సంకల్పానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రతి దిక్కుకి రక్షణగా ఓ పర్వతాన్ని సృష్టించాడట. దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూరా, తూర్పున సూర్యగిరి కొండల్ని సృష్టించాడు.
ఆపై యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించాడు. ఇక బ్రహ్మదేవుని యజ్ఞానికి సుమూహుర్తం ఆసన్నమయింది. దేవతలంతా వచ్చారు కానీ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని ధర్మపత్ని అయిన సావిత్రీదేవి (ఈమెనే సరస్వతి అని కూడా పిలుస్తారు) మాత్రం సమయానికి రాలేదు. సమయం ఆసన్నమవుతున్నా ఆమె రాకపోవడంతో బ్రహ్మదేవుడు తన కుమారుడైన నారదుల వారిని పిలిచి ఆమె కోసం పంపించాడు. నారదుడు అక్కడికి వెళ్లేసరికి సావిత్రీదేవి కూడా సిద్ధంగానే ఉంది. కలహభోజనుడు ఊరికే ఉంటాడా? ‘నువ్వు ఒక్కదానివే అప్పుడే వచ్చి ఏం చేస్తావు. నీ స్నేహితులతో కలిసిరా’ అని ఒక ఉచిత సహా ఇచ్చాడు. దీంతో లక్ష్మీ, పార్వతీలతో కలిసి వద్దామని సావిత్రీదేవి ఆగిపోయింది. సుముహూర్తం మించిపోతున్నా ఆమె జాడ లేదు. ఆ తరువాత ఏం జరిగిందో తర్వాతి కథనంలో తెలుసుకుందాం.
