విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడికి హిందువులంతా అత్యంత ప్రాధాన్యమిస్తారు. వినాయక చవితి వస్తోందంటేనే దేశ వ్యాప్తంగా సందడి మొదలవుతుంది. బాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రోజున మనం వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటాం. విగ్రహం తీసుకొచ్చే విషయం నుంచి ప్రతిదీ ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. మన దేశంలో ప్రతి ఊరిలోనూ ఓ వినాయక క్షేత్రం ఉంటుంది. అయితే వాటిలో ప్రసిద్ధి గాంచినవి కొన్నే ఉంటాయి. వాటిలో ముంబైలోని సిద్ధి వినాయక క్షేత్రం. వాస్తవానికి ముంబైలో అనేక పురాతన, ప్రసిద్ధ వినాయక దేవాలయాలున్నా కూడా సిద్ధి వినాయక క్షేత్రం చాలా ప్రత్యేకం.
ప్రభాదేవి ప్రాంతంలో ఈ సిద్ధి వినాయకుని క్షేత్రం ఉంది. దేశంలో బాగా ప్రఖ్యాతిగాంచిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయంలో మనకు కనిపించే వినాయకుడు ఇతర ఆలయాల్లోని వినాయకులకు భిన్నంగా ఉంటాడు. మరి ఇక్కడి వినాయకుడి ప్రత్యేకత ఏంటి అంటారా? ప్రకాశవంతమైన ఎరుపు రంగుతో ఉంటాడు. అన్ని ఆలయాల్లోని వినాయకుడు ఏదో ఒక రంగులో ఉంటాడు కాబట్టి ఇదేమీ ప్రత్యేకం కాదు.. అయితే వినాయకుడు మూడో కన్నుతో కనిపిస్తాడు. అలాగే వినాయకుడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. ఒక్కో చేతిలో ఒక్కో వస్తువు పట్టుకుని కనిపిస్తాడు. ఒక చేతిలో గొడ్డలి.. మరో చేతిలో జపమాల, ఇంకో చేతిలో మోదకం.. మరో చేతిలో కమలంతో వినాయకుడు దర్శనమిస్తాడు.