
ప్రతి స్త్రీ లో అన్నపూర్ణా దేవి అంశ ఉంటుంది …
అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణ వల్లభే..
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతి
“అన్నము నుండే సమస్త జీవులు సృష్టింపబడుతున్నవి. సమస్త జీవులకు ప్రాణ శక్తి అన్నము నుండే ఉద్భవిస్తుంది. ఆకలి ప్రాణ శక్తిని క్షీణింపజేస్తున్నది. కనుక అన్నము, ప్రాణ శక్తి, ఆకలి మూడును ఒకదానికొకటి అనుసంధానము కలిగి ఉన్నవి. ఆకలి రెండు రకములు మొదటిది శరీర పోషణకు సంబంధించినది. రెండవది పారమార్థికమునకు సంబధించినది. ఈ రెండు ఆకళ్ళను తీర్చే తల్లి శ్రీ అన్నపూర్ణా దేవి. అందుకే అమ్మను ప్రాణ శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటాం.
కాశీ క్షేత్రంలో అన్నపూర్ణా దేవి కొలువై ఉన్నట్లే.. శ్రీ క్షేత్ర హొరనాడు అనే క్షేత్రంలో శ్రీ ఆది శంకర ప్రతిష్టిత అన్నపూర్ణా దేవి ఆలయం ఉన్నది. అన్నపూర్ణేశ్వరి దేవాలయం కర్ణాటకలోని హొరనాడులో, చిక్కమంగళూరు నుంచి 100 కిమీ దూరంలో ఉంది. దీని చుట్టూ పశ్చిమ కనుమల దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ దేవాలయానికి పరిసర ప్రాంతంలోనే భద్ర నది ప్రవహిస్తుంది. ఈ ఆలయాన్ని ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మనవర ఆలయం లేదా శ్రీ క్షేత్ర హొరనాడు ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడి దేవతా విగ్రహాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్టించాడని మరో కథనం కూడా ఉంది.
