దేశంలో ఎన్నో పురాతన హిందూ దేవాలయాలు ఉన్నాయి. అవి చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. సాధారణ రోజుల్లో కంటే కొన్ని ప్రత్యేక దినాల్లో ఈ ఆలయాలను భక్తులు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఒక అమ్మవారి ఆలయం ఉంది. మొహల్లా హల్లు సారాయ్‌లో ఈ ఆలయం ఉంది. చాముండా దేవి ఆలయంగా ఇది ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయం సుమారు 1500 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. పృథ్వీ రాజ్ చౌహాన్ ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్మకం. చాముండా దేవి చౌహాన్ రాజవంశం కుల దేవత అని నమ్ముతారు. ఇక్కడ నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు.
నవరాత్రి సమయంలో ఇక్కడ విశేష ఉత్సవం ఒకటి జరుగుతుంది. ప్రతి నవరాత్రికి హిమాచల్‌ప్రదేశ్‌లోని జ్వాలాదేవి ఆలయం నుంచి దివ్యకాంతిని ఈ ఆలయానికి తీసుకువస్తారు. దీనిని కన్నులారా వీక్షించి పూజలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతారు. ఈ ఏడాది కూడా చైత్ర నవరాత్రి ఆదివారం ప్రారంభమైంది. తొలి రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చారు. చైత్ర నవరాత్రులలో చాముండా అమ్మవారిని దర్శించుకుని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. ఈ నవరాత్రుల్లో అమ్మవారి అలంకారం అపురూపంగా ఉంటుందని భక్తులు చెబుతున్నారు. అమ్మవారిని పసుపు, కుంకుమ, అలంకరణ వస్తువులతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.