సీతాదేవితో కొలువైన సీతారాముడు.. హనుమంతునితో సేవించబడే కోదండరాముడు.. లక్ష్మణ భరత శత్రుఘ్నులచే పూజించబడే తారకరాముడు, విభీషణుని వింజామర వీవెనలందుకునే కౌసల్యరాముడు, జాంబవంతుని వందనాలను అందుకుంటున్న దశరథరాముడు.. అంగదునితో కొలువబడే ఆశ్రిత రాముడు.. సర్వులను సంరక్షించే మోక్షరాముడికి ఇవాళ దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో అంగరంగ వైభవంగా కల్యాణం జరగనుంది. అన్ని ఆలయాలు ఒక ఎత్తు.. రామాలయాలు ఒక ఎత్తు. ఊరిలో ఏ దేవుడి ఆలయం ఉన్నా లేకున్నా రామాలయం మాత్రం పక్కాగా ఉండి తీరుతుంది.
శ్రీరామనవమి సందర్భంగా సందడిగా రామాలయాలన్నీ సందడిగా మారాయి. ఇక మనం ఒక రామయ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా రాముడికి మీసాలు ఉండవు. కానీ ఈ రామయ్యకు మాత్రం మీసాలుంటాయి. అదే ఆయన ప్రత్యేకత. ఆ ఆలయం మరెక్కడో లేదు. హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌లో ఉంది. ఈ రామాలయాన్ని రెండో భద్రాద్రిగా పిలుస్తారు. ఈ ఆలయంలో రామచంద్రస్వామి స్వయంభుగా వెలిశారు. ఈ రామాలయాన్ని 800 ఏళ్ల కిందట నిర్మించారు. ఇక శ్రీరామనవమి నేపథ్యంలో సీతారాముల కల్యాణాన్ని కన్నులారా వీక్షించేందుకు ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.