
విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయవిజయుల శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయవిజయులు ఇరువురూ విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోని రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడమూ… వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలను దాల్చడం తెలిసిందే! ఇంతకీ ఆ జయవిజయులకు శాపం ఇచ్చి, పరోక్షంగా లోకకళ్యాణానికి కారణమైన వారు మరెవ్వరో కాదు- సనకసనందనాదులు! ఇంతకీ ఎవరీ సనకసనందనాదులు?
చాలామంది సనకసనందనాదులు ఇద్దరనుకుంటారు. నిజానికి వీరు నలుగురు అన్నదమ్ములు. వారి పేర్లు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. కొన్ని చోట్ల సనత్సుజాతుని పేరు బదులుగా సనాతన అన్న పేరు కనిపిస్తుంది. ఈ నలుగురు అన్నదమ్ములూ బ్రహ్మమానస పుత్రులు. ప్రాణులను సృష్టించే పనిని ప్రారంభించిన బ్రహ్మదేవుడు, తన పనిలో తోడుగా ఉంటారని తలంచి ఈ నలుగురికీ జన్మనిచ్చాడట. అయితే బ్రహ్మదేవుని మానసం నుంచి పూర్తి సత్వ గుణంతో ఆవిర్భవించిన సనకసనందనాదులు… తమ జీవితాలను వైరాగ్యంలోనే గడిపేందుకు సిద్ధపడ్డారు.
