ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి తెలుసా?

కర్ణాటకలోనూ ప్రసిద్దిగాంచిన ఆలయాలు చాలానే ఉన్నాయి. వాటిలో మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలున్నాయి. ఆది సుబ్రహ్మణ్య క్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం ఉన్నాయి. ఇవి మూడింటిని కలిపితే ఆసక్తికరంగా సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో వారికి కొన్ని దోషాల నుంచి ఉపశమనం కలుగుతుందట. ఎవరికైతే కుజ, రాహు, కేతు దోషాలు, సకల నవగ్రహ దోషాలు ఉంటాయో.. వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వీటన్నింటిని నుంచి ఉపశమనం లభిస్తుందట.

ఈ ఆలయాల్లో మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి తెలుసుకుందాం. బెంగుళూరు నగరానికి ఈ క్షేత్రం 60 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర ఈనాటిది కాదు.. దాదాపు 600 ఏళ్ల క్రితం నాటిది. ఈ ఆలయాన్ని మొదట సండూర్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించిన ఘోర్‌పడే పాలకులు అభివృద్ధి చేశారు. ఇక్కడ ప్రధాన దైవంగా కార్తికేయుడు కొలువు దీరాడు. ఆసక్తికరంగా స్వామివారు నరసింహ స్వామితో కలిసి కొలువుదీరి ఉండటం విశేషం. ఈ రెండు విగ్రమాలు భూమి నుంచి ఉద్భవించాయని భక్తుల విశ్వాసం. నరసింహ స్వామివారి విగ్రహం ఎక్కడుంటుందంటే.. ఏడు తలల నాగుపాముతో ఉన్న కార్తికేయ విగ్రహానికి వెనుక వైపున ఉంటుంది.

Share this post with your friends