
మారేడు చెట్టు ప్రయోజనాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా కార్తీక మాసం, మాఘ మాసంతో పాటు ప్రతి మాస శివరాత్రికీ మారేడు చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎప్పుడో కాదు.. ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుందని నమ్మకం. మారేడు కొమ్మ చేతితో పట్టుకుని, మారేడు చెట్టును పూజించాలి. అనంతరం చేతిలో పట్టుకున్న ఆ కొమ్మను శివునికి సమర్పించాలి. ఇలా చేస్తే సకల పాపాలు తొలగిపోతాయట. అలాగే ఒక్క శివ భక్తుడికి మారేడు చెట్టు కింద భోజనం పెట్టినా కూడా కోటి మంది భక్తులకు అన్నదానం చేసిన ఫలితం లభిస్తుందట.
మారేడు చెట్టు కింద పాయసాన్ని వండి శివభక్తులకు పెడితే ఆ కుటుంబంలోనే కాదు.. వంశంలోనే దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయట. మారేడు చెట్టు కుదురు నీటితో తడిస్తే శివయ్యకు చాలా ఇష్టమని శివపురాణం చెబుతోంది. కాబట్టి నిత్యం మారేడు మొదలును నీటితో తడిపితే శివయ్య అనుగ్రహం మనపై పరిపూర్ణంగా ఉంటుందట. ఇంట్లో సుఖ సంతోషాలు చెక్కు చెదరకూడదంటే.. నిత్యం గంధం, పుష్పాలతో మారేడు చెట్టు మూలాన్ని పూజించాలట. అప్పుడు ఇ ఇంట నివసించే వారికి కైలాసంలో అర్హత లభించడంతో పాటు వంశం వృద్ధి చెందుతుందట.
