వినాయక చవితి సందడి ఇప్పటికే ప్రారంభమైంది. దేశం మొత్తం వినాయక చవితిని జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. వినాయక చవితి పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే వినాయకుడిని పూజించేటప్పుడు తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పులు మనల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. కాబట్టి ఏ తప్పులు పొరపాటున కూడా చేయకూడదో తెలుసుకుందాం.
వెండి వస్తువులు: వినాయక చవితి రోజున మాత్రమే కాదు.. ఎప్పుడైనా సరే.. విఘ్నేశ్వరుడి పూజలో వెండి పాత్రలు, తెల్లటి వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదట. చివరకు గంధం కూడా తెల్లది వాడకూడదట. దానికి బదులుగా పసుపు చందనం వాడుకోవచ్చట. తెల్లని వస్త్రానికి బదులుగా పసుపు వస్త్రం వాడవచ్చట. ఇలా తెలుపు మాత్రం అస్సలు వాడకూడదట.
పగిలిన బియ్యం: వినాయకుడి పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ విరిగిన బియ్యాన్ని మాత్రం వాడకూడదట. మంచి బియ్యాన్నే అక్షితలుగా ఉపయోగించాలట. అలాగే పొడి బియ్యాన్ని సైతం వినాయకుడి పూజలో వినియోగించకూడదట.
మొగలి పువ్వులు: శివుడు వలెనే గణేశుడి పూజలో కూడా మొగలి పువ్వులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదట. మొగలి పువ్వుని శివుడు శపించాడట. కాబట్టి ఈ పుష్పాన్ని వినాయకుడి పూజలోనూ వాడకూడదట.
ఎండిన పువ్వులు: వినాయకుని పూజలో ఎండిపోయిన పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. తాజా పువ్వులను మాత్రమే వినియోగించాలి. ఒకవేళ తాజా పువ్వులు దొరకకపోతే వదిలేయండి. వాటి స్థానంలో దర్బను కానీ లేదంటే అక్షతలను సమర్పించినా చాలు. ఒకవేళ ఎండిన పువ్వులను వాడితే ఇంట్లో శాంతి లోపిస్తుందని అంటారు.