తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు త్వరలో అలిపిరి పాదాల మండపం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీని పునఃప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. నిన్న తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు ఈవో జే శ్యామలరావు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాల నాణ్యత పెంచేందుకు టీటీడీ చేపట్టిన చర్యలను పలువురు భక్తులు ప్రశంసించారు.
ఆన్‌లైన్‌లో రూ.300 ఎస్ఈడీ టికెట్లు పొందిన భక్తులకు తిరుమలలో వసతి కల్పించాలని ఓ భక్తుడు ఈవోని కోరగా అధికారులతో చర్చించి పరిశీలిస్తామన్నారు. మరో భక్తుడు టీటీడీ ఆన్లైన్ డిప్ సిస్టంలో సుప్రభాతం, తోమాల, అర్చన ఒక్కొక్కరికి కాకుండా, కళ్యాణోత్సవంలో ఇద్దరికీ కేటాయిస్తున్న విధంగా, లక్కీ డిప్‌లో కూడా కుటుంబ సభ్యులు అందరికి ఇవ్వాలని.. అలాగే ఆలయంలోని క్యూ లైన్లలో ఫ్యాన్లు, లైటింగ్ పనిచేయడం లేదని తెలిపాడు. దీనికి స్పందించిన ఈవో స్వామి వారి దర్శనం, సేవలకు లక్షలమంది భక్తులు ప్రయత్నిస్తుంటారు. అందరికీ అవకాశం కల్పించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టాం. క్యూలైన్లలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.