నిజంగానే వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నాడా?

‘వసుదేవుడు అంతటివాడికే గాడిద కాళ్ళు పట్టుకోక తప్పలేదు’ అనేది మనం నిత్యం వింటూ ఉండే మాట. మరి నిజంగానే వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నాడా? అంతటి అగత్యం ఆయనకు ఏమొచ్చింది? ఒకసారి చూద్దాం. శ్రావణమాసం బహుళ అష్టమినాడు రోహిణి నక్షత్ర సమయంలో దేవకి అష్టమ గర్భాన శ్రీకృష్ణుడు జన్మించాడు. అయితే శ్రీకృష్ణుడు తన అవతరణకు ముందే చతుర్భుజ నారాయణ స్వరూపంతో దేవకీ వసుదేవులకు దర్శనమిచ్చి తను పుట్టగానే గోకులానికి చేర్చమని చెబుతాడు. అప్పుడే జన్మించిన యోగమాయను కంసునికి అప్పగించమని నారాయణుడు చెప్పి శిశురూపం దాల్చాడు.

శ్రీకృష్ణుడు జన్మించాడు. భగవంతుడి మహిమతో కారాగార ద్వారాలు వాటంతటవే తెరుచుకోవడంతో పాటు అందరినీ నిద్రా దేవి ఆవహించింది. దీంతో కావలివారు గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. బయట కుండపోపత వర్షం కురుస్తోంది. వసుదేవుడు శ్రీకృష్ణుడిని గంపలో పెట్టి.. దానిని నెత్తిన పెట్టుకుని గోకులం వైపు వెళుతుండగా యమునా నది వచ్చింది. వసుదేవుడు అక్కడకు రాగానే యమునా నది సైతం రెండు పాయలుగా విడిపోయిందట. అయితే ఈ క్రమంలోనే గాడిద అరుపులు వినిపించాయి. దీంతో ఎక్కడ కావలి వారు నిద్ర లేస్తారోనని వెంటనే వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నాడని చెబుతారు. వాస్తవానికి ఇది అబద్ధమట. ప్రపంచాన్ని ఆవహించిన నిద్రాదేవి గాడిదను మాత్రం మెలుకువతో ఉంచిందా? కాబట్టి ఇదంతా అబద్ధమట.

Share this post with your friends