పవిత్ర పుణ్యక్షేత్రం మంజునాథ ఆలయంలో అంత దారుణం జరిగిందా?

ధర్మస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కర్నాటకలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రానికి నిలయం. అలాంటి ధర్మస్థల ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కనీవినీ ఎరుగని భయంకరమైన ఆరోపణలతో ఈ ఆలయం కలకలం రేపుతోంది. ఈ పవిత్ర ప్రదేశంలో రెండు దశాబ్దాల్లో వందలాది మంది మహిళలు హత్యకు గురయ్యారట. ఈ విషయం తాజాగా ఓ పారిశుద్ధ్య కార్మికుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. అసలు పారిశుధ్య కార్మకుడు ఏమని ఫిర్యాదు చేశాడో ముందుగా తెలుసుకుందాం. వందలాది మహిళల మృతదేహాలు చాలా వరకూ లోదుస్తుల కూడా లేకుండా ఉన్నాయని తెలిపాడు.

వారిలో చాలా మంది బాలికలున్నారని.. వారి మృతదేహాలు యూనిఫామ్‌లో ఉన్నాయని పారిశుద్య కార్మికుడు తెలిపాడు. మృతదేహాలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన గాయాలు సైతం ఉన్నాయని వెల్లడించాడు. ఆ మృతదేహాలన్నింటినీ తనే ఖననం చేసినట్టు తెలిపాడు. ధర్మస్థలలోని మంజునాథ ఆలయంలో 1995 నుంచి 2014 మధ్య తను పని చేశానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఆ వ్యక్తి ఈ నెల 3వ తేదీన దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించాడు. తన 20 ఏళ్ల సర్వీసులో వందలాది మృతదేహాలను ఖననం చేసినట్టు అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు ఇష్టం లేకుండానే ఈ పనులన్నీ చేశానని.. గతంలో ఓ సారి ఫిర్యాదు చేయబోతే తనను దారుణంగా కొట్టారని ఆ తరువాత తాను వేరే రాష్ట్రానికి పారిపోయానని తెలిపాడు. ఇక ఇప్పుడు తనకు పాప భీతి వేధిస్తుండటంతో తిరిగి వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్టు వెల్లడించాడు. ఏది ఏమైనా మంజునాథ ఆలయానికి సంబంధించి ఇలాంటి వార్తలు రావడం ఆందోళనకు గురి చేస్తోంది.

Share this post with your friends