
విజయవాడలోని ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆషాఢ మాసం కావడంతో అమ్మలగన్న అమ్మ.. ముగ్గురు అమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మకు పెద్ద ఎత్తున భక్తులు సారె సమర్పించేందుకు తరలి వస్తున్నారు. వీకెండ్ కావడంతో విజయవాడలోని దుర్గమ్మ ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు నిన్నటి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఒకవైపు విపరీతంగా భక్త జన సందోహం.. మరోవైపు వర్షాల నేపథ్యంలో విజయవాడ వన్ టైన్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
ఆలయ వైదిక కమిటీ తరపున దుర్గమ్మకి తొలి ఆషాఢం సారె సమర్పించారు. ఇక ఆ తరువాతి నుంచి భక్తులంతా అమ్మవారికి సారెను సమర్పిస్తూ వస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కొండ చరియనే విరిగి పడతాయనే కారణంగా అధికారులు ఘాట్ రోడ్ వైపు రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం భక్తులంతా కనకదుర్గ నగర్ నుంచి సారెను తీసుకు వెళ్తున్నారు. వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున వాహనాల్లో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఇంద్రకీలాద్రికి సరైనటువంటి పార్కింగ్ ఫెసిలిటీ లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలన్నింటినీ నిలిపి వేస్తున్నారు.
