అయోధ్య బాల రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. నూతన సంవత్సరంలో బాలరామయ్యను చూడాలని.. ఏడాది కాలంగా అనుకుంటూ వీలు పడని వారంతా ఇప్పుడు పెద్ద ఎత్తున అయోధ్యకు తరలి వస్తున్నారు. వీరికోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నా కూడా అవి సరిపోవడం లేదు. ఈక్రమంలోనే ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తూ.. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. అయోధ్యలోని హోటల్స్ అన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. జనవరి 15 వరకూ ముందస్తు బుకింగ్స్ జరిగాయి.
ఈ విషయాన్ని స్థానిక హోటల్ యజమానులు స్వయంగా చెబుతున్నారు. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే గదుల లభ్యత ఉందని జాతీయ మీడియా సైతం పేర్కొనడంతో ఇదే అదునుగా కొందరు హోటళ్ల యజమానులు ఒక్కరోజుకు రూ.10వేల వరకు వసూలు చేస్తున్నాయట. భక్తులు పెద్ద మొత్తంలో తరలి వస్తుండటంతో అయోధ్య పోలీసులు సైతం ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టడం జరిగింది. అయోధ్య, వారణాసి ఆలయాలను దర్శించుకునే భక్తుల కారణంగా.. ఉత్తరప్రదేశ్‌కు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. గత ఏడాది ఒక్క జనవరిలోనే రికార్డ్ స్థాయి ఏడు కోేట్ల మంది భక్తులు అయోధ్య రామయ్యను దర్శించుకున్నారు. ఈ ఏడాది ఎంతమంది దర్శించుకుంటారో చూడాలి.