
కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తెలిసిందే. కాబట్టి ఇవాళ శివ క్షేత్రాలన్నింటిలోనూ భక్తుల సందడి నెలకొంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఆలయంలోని పాతాళ గంగలో పుణ్యస్నానమాచరించి కార్తీక దీపాలను పెద్ద ఎత్తున వెలిగిస్తున్నారు.
కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఇప్పటికే వీకెండ్స్‌తో పాటు కార్తీక సోమవారం నాడు స్వామివారి స్పర్శ దర్శనం, సామూహిక, గర్భాలయ అభిషేకాలను నిలిపి వేశారు. అలానే మంగళవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే రోజుకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతించనున్నారు. ఇక ఇవాళ శ్రీ మల్లికార్జున స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి కల్పిస్తున్నారు. ఇవాళ సాయంత్రం కార్తీక సోమవారం సందర్భంగా ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.
