బాసరకు పోటెత్తిన భక్తులు.. నేడు, రేపు పలు సేవల రద్దు

వసంత పంచమి సందర్భంగా బాసర శ్రీ సరస్వతి దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తమ చిన్నారుల విద్యాభ్యాసాల కోసం పెద్ద ఎత్తున భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. వసంత పంచమి నేపథ్యంలో అధికారులు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రెండు రోజుల ముందే బాసర సరస్వతీదేవి ఆలయానికి వెళ్లి అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరి పుష్కర ఘాట్లో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలని సూచించారు.

నదిలో స్నానం చేసిన భక్తులకు అవసరమైన గదులను ఏర్పాట్లను చేయడంతో పాటు గజఈత గాళ్లను సైతం నది వద్ద సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అలాగే రాత్రిపూట విద్యు త్ దీపాలను అమర్చాలని తెలిపారు. అలాగే నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చే నేడు, రేపు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల సమయంలో రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలైన రుద్రాభిషేకం, కుంకుమార్చన, వాహనపూజ, సత్యనారాయణపూజ, వేదాశీర్వచనం, చండీహోమం రద్దు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Share this post with your friends