ఎప్పుడూ సత్యాన్నే పలుకమని.. మాంసాహారం మానేయమని బోయకు ముని చెప్పడంతో నిష్టగా దానిని పాటిస్తూ ఉండిపోయాడు. అయితే ఒకరోజు బోయ అడవిలో ఎంత వెదికినా ఆహారం దొరకలేదు. పండుటాకులను తినబోయాడు. వాటిని తినొద్దని అశరీరవాణి చెప్పడంతో రోజంతా ఉపవాసంతోనే ఉండిపోయాడు. ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు. మరుసటి రోజు కూడా ఎంతగా ఆహారం కోసం వెదికినా దొరకలేదు. అయినా సరే ఉపవాసంతోనే ముని పాదపద్మాలనే మనసులో తలచుకుంటూ ధ్యానంలో నిమగ్నమైపోయాడు. అలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు దుర్వాస మహర్షి అక్కడకు వచ్చాడు. ఆయనను చూసిన బోయ భక్తితో నమస్కరించి, తన ఆతిథ్యం స్వీకరించి వెళ్లమని కోరాడు. అప్పటికే ఆహారం లేక బోయ నీరసించిపోయి.. బక్కచిక్కి పోయి ఉన్నాడు. కానీ అతని ముఖంలో దివ్య వర్చస్సు ఉట్టిపడుతోంది. దుర్వాసుడికి విషయం అర్థమైంది.
బోయను పరీక్షించాలనుకున్నాడు. తనకు చాలా ఆకలిగా ఉందని.. మృష్టాన్న భోజనం చేయాలని ఉందని.. కానీ నువ్వే నిరాహారంతో ఉన్నావు.. నాకేం పెట్టగలవని అడిగాడు. దుర్వాసునికి ఆతిథ్యం ఇవ్వడానికి బోయ ఒక పాత్ర తీసుకుని పక్క గ్రామానికి వెళ్లాడు. అక్కడి బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లగా అతన్ని ఆదరించి బోలెడన్ని శాకపాకాలను పాత్రలో నింపారు. ఆ పదార్థాలన్నీ దుర్వాసుడికి వడ్డించాడు. తాను స్నానం చేయనిదే ఏమీ తినని.. నది వరకూ వెళ్లలేనని.. తన స్నానానికి నీవే ఏర్పాట్లు చేయాలని సూచించాడు. అప్పుడు బోయ నది వద్దకు వెళ్లి తాను దుర్వాసుడికి ఆతిథ్యం ఇవ్వదలిచానని.. ఆయన స్నానానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పాడు. తాను సత్యవ్రతుడినైతే ముని స్నానానికి సహకరించమని కోరాడు. అప్పుడు దేవకి నది అతనితో వెళ్లగా.. దుర్వాసుడు నదిలో స్నానమాచరించాడు.