వివాదాస్పదంగా హైదరాబాద్ గణేష్ నిమజ్జనం..

ముంబై తరువాత హైదరాబాద్‌‌లో వినాయక చవితి పెద్ద ఎత్తున జరుగుతుంది. వినాయక చవితి, నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక వినాయక నవరాత్రుల్లో చివరి ఘట్టం.. అత్యంత కీలకమైన ఘట్టం గణేష్ నిమజ్జనం. ప్రతి ఏటా గణేష్ నిమజ్జన సమయంలో హుస్సేన్ సాగర్ అత్యంత కోలాహలంగా మారుతుంది. వరుసబెట్టి వచ్చే గణనాథులు.. తిలకించేందుకు వచ్చే జనంతో ట్యాంక్ బండ్ అంతా సందడి నెలకొంటుంది. అయితే ఈసారి ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.

పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బారికేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. అలాగే పోలీసులు ఏర్పాటు చేసిన జాలీలను సైతం తొలగించారు. ఎన్నో ఏళ్లుగా ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనం కార్యక్రమం జరుగుతోందని.. కొత్త రూల్స్ తీసుకువచ్చి భక్తుల మనోభావాలను ప్రభుత్వం, పోలీసులు దెబ్బతీస్తున్నారని గణేష్ ఉత్సవ సమితి అంటోంది. గతంలో కూడా ఇలాగే అన్నారని కానీ చివరకు ట్యాంక్‌బండ్‌లోనే నిమజ్జననం జరిగిందంటున్నారు. ఒకవేళ ఈసారి హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని నిర్వహించనీయకుంటే నగర వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింపచేస్తామని గణేష్ ఉత్సవ కమిటి హెచ్చరిస్తోంది.

Share this post with your friends