కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత..

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాల తలుపులు మూసుకున్నాయి. శీతాకాలం నేపథ్యంలో భాయ్ దూజ్ పండగ రోజున వైదిక ఆచారాల నడుమ శాస్త్రోక్తంగా ఆలయ తలుపులను మూసివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీతో పాటు పెద్ద ఎత్తున భక్తులు సైతం పాల్గొన్నారు. ఇప్పటి నుంచి ఆరు నెలల పాటు బాబా కేదార్ ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో కేదారేశ్వరుడు పూజలందుకుంటాడు.కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేత అనంతరం స్వామివారిన పంచముఖి ఉత్సవ డోలి యాత్రగా తరలించారు.

ఈ డోలి యాత్ర సందర్భంగా వేలాది మంది భక్తులు ఇండియన్ ఆర్మీ బ్యాండ్‌తో కలిసి నృత్యాలు చేశారు. కేదార్‌నాథ్ ఆలయాన్ని ఉదయం 8:30 గంటలకు, యమునోత్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12:05 గంటలకు మూసివేశారు. అనంతరం కేథారేశ్వరుని విగ్రహాలు, యమునోత్రి అధిష్టానం దేవత యమునా దేవిని పల్లకీలలో ఊరేగిస్తూ వారి శీతాకాల నివాసాలైన ఉఖిమత్, ఖర్సాలీలకు తీసుకెళ్లారు. ఈ ఏడాది మొత్తంగా కేదారేశ్వరుడిని 16.5 లక్షల మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఆలయ మూసివేత కార్యక్రమాన్ని తిలకించేందుకు 18 వేల మందికి పైగా యాత్రికులు కేదార్ నాథ్ ధామ్‌ను చేరుకున్నారు.

Share this post with your friends