తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈవో మీడియాతో మాట్లాడుతూ,
– ఈ రోజు(24-8-2024) నాటికి తిరుమలలో కుమారధార & పసుపుధార, పాపవినాశనం, ఆకాశగంగ మరియు గోగర్భం డ్యామ్‌లలో కలిపి 4,592 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది.
– తిరుపతి, తిరుమల నీటి అవసరాలకు ఉపయోగపడే తిరుపతిలోని కల్యాణి డ్యాంలో నేటికి 5,608 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది.
– తిరుపతి, తిరుమలలో ఉన్న నీటిని క్రమ పద్ధతిలో వినియోగించుకోవడం ద్వారా, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనపు నీటి అవసరాలతో సహా 130 రోజుల వరకు (అంటే 31-12-2024 వరకు) సరిపోతుంది.
– ఆగస్టు 22న తిరుపతి మున్సిపల్ కమీషనర్ మరియు సోమశిల ప్రాజెక్ట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ తో చర్చించడమయినది. తిరుపతి మున్సిపల్ కమిషనర్ కల్యాణి డ్యామ్ నుండి 5 MLD (11 లక్షల గ్యాలన్లు) నీటిని అదనంగా సరఫరా చేయడానికి అంగీకరించారు. తద్వారా అదనంగా మరో నెల రోజులు తిరుమల నీటి అవసరాలు తీరుతాయి.
– కైలాసగిరి రిజర్వాయర్ నుండి మరో 10 MLD నీరు తిరుపతికి సరఫరా కానుంది. అదేవిధంగా తిరుపతికి నీటి సరఫరాను పెంచడానికి అదనపు పైప్‌లైన్ వేయడానికి టిటిడి రూ.40 కోట్లు మంజూరు చేసింది.
– టిటిడి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు మొదటి విడతగా రూ. 5.62 కోట్లను విడుదల చేసింది. అదనపు పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను కోరడమైనది. తద్వారా తిరుపతి నుండి తెలుగు గంగ నీరు తిరుమలకు సరఫరా చేయడానికి వీలవుతుంది.
అంతకుముందు ఈవో టీటీడీ ఇంజనీరింగ్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సిఈ నాగేశ్వరరావు, ఎస్ ఇ-2 శ్రీ సత్యనారాయణ, ఈఈ (వాటర్ వర్క్స్) శ్రీ సుధాకర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ శ్రీ వెంకటరమరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.