
చండీశ్వరుడి కథ తెలుసుకున్నాం కదా. చండీశ్వరుడిని ఆలయానికి వెల్లి పిలిస్తే ఆయనకు కోపం వస్తుందట. ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు కేవలం చిన్న చిటిక వేయాలట. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటికె వేస్తే.. కళ్లు తెరిచి చూసి.. ‘ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణా ధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళి పోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము.
దానిని మీరు గుడియందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలి పెట్టేయ్యకూడదు. నంది మీద పెట్టడం కాదు. చండీశ్వర స్థానమునందు చప్పట్లు కొట్టకూడదు. అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు. ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు. చండీశ్వరుడు మాత్రం ఉత్సవ మూర్తులలో ఉంటాడు. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి అయిదవ స్థానం ఇచ్చారు. ఒక్కసారి శివాలయంలోకి మనం గడపదాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము.
