కొలనుపాకలో 8 నుంచి ఐదు రోజుల పాటు చండీయాగం

యాదాద్రి జిల్లా కొలనుపాకలో శ్రీ మాతా పితృ గోక్షేత్రమ్‌లో శ్రీ పులి సీతారామ శర్మ ఆధ్వర్యంలో చతురాయన సహిత శతచండీ యాగము జనవరి 8వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. 8వ తేదీ ఉదయం గోపూజ, వేదస్వస్తి, మంగళవాయిద్యములతో ఆలయ ప్రదక్షిణ, సంకల్పము, గణపతి పూజ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అదే రోజున సాయంత్రం 4:30 గంటలకు ప్రదోష కాల పూజతో తిరిగి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం 9వ తేదీ ఉదయం 8 గంటలకు గోపూజ, వేదస్వస్తి, నిత్య పూజ, చండీప పారాయణములు నిర్వహించనున్నారు.

ఉదయం 10 గంటలకు లక్ష్మీ నారసింహ, సుదర్శన హోమము, పవమాన హోమములను నిర్వహించనున్నారు. 11వ తేదీన మహా లింగార్చన, రుద్రక్రమార్చన, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక చివరి రోజైన 12వ తేదీన 7 గంటలకే పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, అవభృదము, హారతి, మంత్రపుష్పము వంటి కార్యక్రమాలతో చండీ హోమము ముగియనుంది. వీటితో పాటు ఐదు రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు శ్రీ గోపాలకృష్ణ స్వామికి అభిషేకం, 9:30కు శ్రీ లలితాదేవి లక్ష కుంకుమార్చన, మధ్యాహ్నం 12:30 గంటలకు బ్రహ్మచారి పూజ, బాలాకుమారి పూజ, సువాసినీ పూజ నిర్వహించనున్నారు.

Share this post with your friends