బోనాల మహోత్సవం నేటితో ముగియనుంది. ఇవాళ మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ బోనాల కార్యక్రమం జరుగనుంది. ఆషాఢమాసమంతా బోనాల సందడితో జంట నగరాలు ఉర్రూతలూగాయి. తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో తొలి ఆదివారం రోజున ఆ బోనాల ఉత్సవం ప్రారంభమైంది. గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో జూలై 7న బంగారు బోనంతో బోనాల సందడి ప్రారంభమైంది. ఇక అక్కడి నుంచి ప్రతి ఆదివారం కొన్ని ప్రాంతాల చొప్పున బోనాల కార్యక్రమం జరుగుతూ వచ్చింది.
అమ్మవారికి అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వండి గ్రామ దేవతలకు సమర్పించారు. ఈ బోనం కుండలను వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరించి.. కుండపైన ఓ దీపాన్ని కూడా పెట్టి అందంగా తయారు చేసి మహిళలంతా బోనం ఎత్తారు. మేళ తాళాలు, డప్పు చప్పుళ్ల సందడితో జంట నగరాలన్నీ కదిలాయి. బోనం కుండలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాయి. బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యా డగటలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మలకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించారు. మొత్తానికి ప్రశాంతంగా బోనాల సందడికి ముగింపు పలకనున్నాం.