యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లేవారికి బిగ్ అలర్ట్

తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట. తెలంగాణ తిరుమలగా దీనిని భక్తులు పిలుచుకుంటారు. ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు కొలువయ్యారు. ఈ ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే ఈ ఆలయ అధికారులు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై యాదగిరిగుట్ట పైన ఫొటోలు, వీడియోలు నిషేధం విధిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ఇష్టానుసారంగా ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రతిష్టకు… వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేదిస్తున్నామని వెల్లడించారు.

స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మాఢవీధుల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగుతుంటారు. వాటిని జ్ఞాపకంగా భద్రపరుచుకుంటారు. అలా చేస్తే అభ్యంతరం లేదని ఆలయ ఈవో తెలిపారు. అయితే వ్యక్తిగత కార్యక్రమాలకు ఆలయాన్ని ఉపయోగించుకుంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇలాంటి చర్యల వలన ఆలయ ప్రతిష్టకు భంగం కలుగడంతో పాటు భక్తుల మనోభావాలు, విశ్వాసానికి ఆటంకం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఇక నుంచి కొండపైన భక్తులు తీసే ఫొటోలు, వీడియోలపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని ఈవో వెల్లడించారు.

Share this post with your friends