వాస్తవానికి ఉదయాన్నే ఆదిత్య స్తోత్రం పఠించినా.. సూర్యునికి అర్ఘ్యమిచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తొలగిపోతాయని నమ్మకం. ప్రత్యక్ష దైవంగా భావించే సూర్య భగవానుడికి ఉన్న పవర్ అలాంటిది. సూర్యునికి ఆలయాలు చాలా తక్కువ. అలాంటిది కాశీలో మాత్రం ద్వాదశ ఆదిత్యాలయాలున్నాయి. ఒక్కడ ఒక్కో ఆలయం ఒక్కో ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటిలో ఒకటి సాంబ కుండం. కాశీలో సూర్యకుండం సమీపంలోనే సాంబాదిత్యుని ఆలయం ఉంటుంది.
ఇక్కడి ఆడిత్యుడిని దర్శించుకుని సాంబ కుండంలో స్నానమాచరిస్తే ఎలాంటి కుష్టు వ్యాధి అయినా ఇట్టే నయమవుతుందట. ఇంతకీ ఈ సాంబుడు ఎవరు అంటారా? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు, జాంబవతిల సంతానమే సాంబుడు. ఒకసారి నారద మహర్షిని ఈ సాంబుడు అవమానించాడట. అసలే నారదుడు విష్ణు భక్తుడు. నిరంతరం నారాయణుడి నామ జపం చేస్తూ ముల్లోకాలు సంచరిస్తూ ఉంటాడు. అలాంటి నారదుడిని అవమానించినందుకు సాంబుడిపై శ్రీకృష్ణుడు ఆగ్రహించి కుష్ఠు వ్యాధితో బాధపడతావని శపించాడట. తరువాత శాంతించి కాశీ క్షేత్రానికి వెళ్లి సూర్యుడిని ఆరాధిస్తే శాప విమోచనం కలుగుతుందని చెప్పాడట. అలా సాంబుడు కాశీ క్షేత్రానికి వెళ్లి ఓ కుండాన్ని నిర్మించి అందులో స్నానమాచరిస్తూ సూర్యారాధన చేసేవాడట. సాంబుడు నిర్మించాడు కాబట్టే దానికి సాంబ కుండం అని పేరు వచ్చింది. ఇక్కడి సూర్య భగవానుడిని సాంబాదిత్యునిగా పూజిస్తారు. సాంబాదిత్యుని అనుగ్రహంతో సాంబునికి కుష్టు వ్యాధి తగ్గింది. ఇక అప్పటి నుంచి కాశీలోని సాంబ కుండంలో స్నానమాచరిస్తే కుష్టు వ్యాధే కాదు.. ఎలాంటి అనారోగ్యమైనా తగ్గి ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం.