నదులను పూజించడం హిందువులకు ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. నదీ స్నానం కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం తో పాటు, పాపాలు పోతాయని నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ నదీస్నానమాచరించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే నదీ స్నాన ఫలం సంపూర్ణంగా దక్కాలంటే కొన్ని నియమాలు పాటించాల్సిందేనని పండితులు చెబుతున్నారు. ప్రస్తుత తరుణంలో అయితే ఎప్పుడు పడుకుంటున్నారో… ఎప్పుడు లేస్తున్నారో కూడా తెలియడం లేదు కానీ.. గతంలో అయితే బ్రహ్మ ముహూర్తానే లేని ఇంటితో పాటు ఇంటి ఆవరణంతా శుభ్రం చేసుకుని స్నానం చేసిన మీదటే వంట పని పెట్టుకునేవరు.
ఇంట్లోనే ఇలా ఉంటే నదీస్నానం విషయంలో ఇంకెంత పద్ధతిగా వ్యవహరించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.. బ్రహ్మ ముహూర్తాన నదీ స్నానం అత్యుత్తమమని అంటారు. అది వీలుపడనప్పుడు 12 గంటల లోపు నదీ స్నానం చేయవచ్చు. ఆ తరువాత చేస్తే మాత్రం ప్రయోజనం లేదని పండితులు చెబుతున్నారు. ఇక రాత్రి వేళల్లో అయితే అస్సలు నదీ స్నానం చేయకూడదట. ఆ సమయంలో యక్షులు, గంధర్వులు సూక్ష్మ రూపంలో నదీ స్నానమాచరించి అనంతరం అక్కడే ధ్యానం చేసుకుంటారట. యక్షులు, గంధర్వుల ధ్యానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించకూడదట. కాబట్టి ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నదీ స్నానం చేయకూడదట.