దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో బాల రామయ్య కొలువయ్యాడు. బాలరామయ్య ఆలయం అందంగానూ.. అద్భుతంగా నిర్మాణం జరిగింది. ఇంకా నిర్మాణ పనులైతే పూర్తి కాలేదు. మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణానికి అయిన ఖర్చుతో పాటు విరాళాల రూపంలో స్వీకరించిన మొత్తాన్ని ఆలయ ట్రస్ట్ పబ్లిక్‌కు తెలియజేసింది. బాల రామయ్య ఆస్థానంలో భక్తుల నుంచి ఒక్క ఏడాదిలో రూ.363 కోట్ల 34 లక్షల నగదుతో పాటు వివిధ వస్తువులు విరాళాలుగా వచ్చాయని ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు. రామ మందిరం దాని ప్రాంగణాల నిర్మాణానికి ఏడాదిలో రూ.776 కోట్లు ఖర్చైందని తెలిపింది. ఒక్క ఆలయ నిర్మాణానికే ఏడాదిలో రూ.540 కోట్లు ఖర్చు చేశారట.
ఒక సంవత్సరంలో ఆలయానికి విరాళాలుగా రూ. 363 కోట్ల 34 లక్షలు రాగా.. వాటిలో రూ.53 కోట్లు ట్రస్టు విరాళాల లేఖలో ఉన్నాయని రామమందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. హుండీ ద్వారా 24.50 కోట్లు వచ్చాయని.. ఆన్‌లైన్‌లో బాల రామయ్యకు రూ.71.51 కోట్ల విరాళాలు వచ్చాయన్నారు. విదేశాల్లోని భక్తులు రూ.10.43 కోట్లు విరాళంగా అందించారన్నారు. ఇక బంగారం వెండి విషయానికి వస్తే.. 20 కిలోల బంగారం, 13 క్వింటాళ్ల వెండి విరాళాల రూపంలో వచ్చిందన్నారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి పేరిట రూ.2100 కోట్ల చెక్కు అందినట్లు చంపత్ రాయ్ తెలిపారు. రామజన్మభూమి వద్ద ఆలయ నిర్మాణం, ఇతర నిర్మాణాలకు రూ.776 కోట్లు ఖర్చు చేసినట్లు చంపత్ రాయ్ తెలిపారు.