కోట్లాది మంది హిందువుల కల గత ఏడాది నెరవేరింది. గతేడాది జనవరిలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట జరిగింది. బాలరామయ్య ఆలయంలో కొలువు దీరడంతో హిందువుల ఆనందానికి అవధల్లేకుండా పోయాయి. ఇప్పుడు మొదటి వార్షికోత్సవానికి సమయం ఆసన్నమైంది. అయితే ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని యోగి సర్కార్ నిర్ణయించింది. ఎంత వైభవంగా అయితే బాల రామయ్య విగ్రహ ప్రతిష్ట నిర్వహించారో అంతే వైభవంగా వార్షికోత్సవాలను సైతం నిర్వహించనుంది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి బాలరామయ్యకు మహాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఋషులు, సాధువులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 11 రనోజుల ముందుగానే వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ నిర్వాహకులు భావిస్తున్నారు. మూడు రోజుల పాటు అంటే, జనవరి 11 నుంచి 13 వరకు జరిగే ఈ మహా క్రతువు కోసం ఆలయ ట్రస్టు, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ మూడు రోజుల పాటు రాంలాలాకు ప్రత్యేక పూజలతో పాటు భాగంగా సంగీత, కళా ప్రపంచంలోని ప్రముఖులు కూడా పాల్గొంటారు.11 రోజుల ముందుగా వార్షికోత్సవం జరపడానికి కారణమేంటంటే.. గతేడాది పుష్య (పౌష) శుక్ల ద్వాదశి నాడు అయోధ్యలో శ్రీ రాంలాలా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ శుభదినాన్ని ‘ప్రతిష్ఠ ద్వాదశి’గా జరుపుకోవాలని రామజన్మభూమి ట్రస్ట్ నిర్ణయించింది. ఈ సంవత్సరం (2025) జనవరి 11న పుష్య శుక్ల ద్వాదశి వస్తోంది కాబట్టి ఆ రోజునే నిర్వహిస్తున్నారు.