
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా కీర్తించబడుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారి క్షణ కాల దర్శనం కోసం కొన్ని సార్లు రెండు రోజుల పాటు క్యూలైన్లలోనే ఉంటారు. కలియుగ దైవం శ్రీ మలయప్ప స్వామివారిని చూడగానే అన్ని గంటల నిరీక్షణను మరిచిపోతారు. భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తకోటి ఉవ్విళ్లూరుతుంది. ఇక తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని దర్శనం తరువాత అత్యంత స్పెషల్ ఏంటంటే స్వామివారి ప్రసాదం లడ్డూ. దీనంత టేస్ట్ ప్రపంచంలో మరే స్వీట్ ఉండదంటే అతిశయోక్తి కాదు.
తిరుమల లడ్డూ ప్రసాదమైన లడ్డూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. తిరుమలకు వెళ్లిన వారు తప్పక లడ్డూని తీసుకొచ్చి తమ ఆత్మీయులకు పంచుతుంటారు. దేశ, విదేశాల వారు వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని ప్రీతిపాత్రంగా స్వీకరిస్తారు. అయితే తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ర్టేలియాకు చెందిన సారా అనే యువతి తన మిత్రబృందంతో కలిసి గురువారం తిరుమలకు వచ్చింది. భారతీయ సంప్రదాయ దుస్తులైన పట్టు లంగా ఓణి ధరించి మరీ స్వామివారిని దర్శించుకుంది. ఆ తరువాత లడ్డూ కౌంటర్ వద్దకు వెళ్లి స్వామివారి లడ్డూలను తీసుకుంది. స్వామివారి ఆలయానికి ఎదురుగా నిలబడి లడ్డూ తింటూ ‘వాహ్వ్.. సో టేస్టీ’ అంటూ మురిసిపోయింది. విదేశీయులు సైతం అంత ఇష్టంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడాన్ని అక్కడున్న వారంతా ఆసక్తిగా తిలకించారు.
