నేటి నుంచి ఆషాఢం.. ఈ నెలలో ఏం చేస్తే శుభకరమంటే..

నేటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాడ మాసం. ఇది సంవత్సరములో 4వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.

ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం శుభకరం. ఆషాడ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.

Share this post with your friends