దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది రంగుల చీరలతో అలంకరిస్తారు. మరి ఆ తొమ్మిది రంగుల చీరలేంటో తెలుసుకుందాం.
మొదటి రోజు: మొదటి రోజున అన్ని ఆలయాల్లో కలశ స్థాపన చేసి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తారు. అలాగే ఆ రోజున అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారని ముందుగానే చెప్పుకున్నాం. శైలపుత్రికి నారింగ రంగంటే చాలా ఇష్టమట. కాబట్టి ఆనందాన్ని, సానుకూల శక్తిని ప్రసరింపజేసే నారింజ రంగు దుస్తుల్లో అమ్మవారిని అలంకరిస్తారు.
రెండవ రోజు: నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణినిగా పూజిస్తారు. బ్రహ్మచరిణికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి రెండవ రోజున అమ్మవారిని శాంతికి, స్వచ్ఛతకు చిహ్నమైన తెలుపు రంగు దుస్తులను అలంకరిస్తారు.
మూడవ రోజు: మూడవ రోజున అమ్మవారు చంద్రఘంట దేవిగా దర్శనమిైస్తారు. జగన్మాతకు ఇష్టమైన ఎరుపు రంగు దుస్తులను అమ్మవారికి అలంకరిస్తారు. ఎరుపు ప్రేమ, బలానికి చిహ్నంగా పరిగణిస్తారు.
నాలుగవ రోజు: దుర్గాదేవి నాలుగవ రోజున కూష్మాండ దేవిగా దర్శనమిస్తుంది. కూష్మాండ దేవికి ముదురు నీలం రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున ఆరోగ్యం, శ్రేయస్సును సూచించే ముదురు నీలం రంగు దుస్తులను అమ్మవారికి అలంకరిస్తారు.
ఐదవ రోజు: ఐదవ రోజున అమ్మవారు స్కందా దేవిగా దర్శనమిస్తుంది. ఈ రోజున అమ్మవారిని పసుపు రంగు చీరలో అలంకరిస్తారు. ఇక పసుపు శుభానికి, ఆనందానికి, ఉత్సాహానికి, సానుకూలతకు చిహ్నం.
ఆరవ రోజు: నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయినీ దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని సమృద్ధి, శ్రేయస్సుకి చిహ్నమైన ఆకుపచ్చ రంగు దుస్తులతో అలంకరిస్తారు.
ఏడవ రోజు: ఏడవ రోజున అమ్మవారిని కాళరాత్రిగా పూజిస్తారు. ఇవాళ అమ్మవారికి బూడిదరంగు దుస్తులు ధరింపజేస్తారు. బూడిద రంగు భావోద్వేగాలను సమన్వయం చేస్తుందని చెబుతారు.
ఎనిమిదవ రోజు: నవరాత్రులలో ఎనిమిదవ రోజున మహాగౌరిని పూజిస్తారు. ఈరోజున మహాగౌరికి సంపద, శ్రేయస్సుకు చిహ్నమైన ఊదారంగు చీరను అలంకరిస్తారు.
తొమ్మిదో రోజు: నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారికి కరుణకు చిహ్నమైన నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులను ధరింపజేస్తారు.