శ్రీవేంకటేశ్వరుని నిత్యకళ్యాణోత్సవాన్ని ప్రవేశపెట్టిందెవరెంటే…

అన్నమయ్య ఉత్సవాల్లో శ్రీవారి శోభను కర్ణపేయంగా వర్ణించడమే కాకుండా, అత్యంత భక్తిప్రపత్తులతో ఎన్నో ఉత్సవాల్లో స్వయంగా పాల్గొనేవాడు. తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి నిత్యకళ్యాణోత్సవాన్ని ప్రవేశపెట్టింది అన్నమాచార్యుడే! శ్రీ వేంకటేశ్వరుడు, అన్నమాచార్యులు స్వగోత్రీకులు. ఇద్దరిదీ భారద్వాజ గోత్రమే! అయినా కట్టుబాట్లను త్రోసిరాజని, శ్రీనివాసునికి కన్యాదానం చేసి, సాక్షాత్తు ఆ శ్రీవారిని అల్లునిగా చేసుకున్నారు అన్నమాచార్యులవారు! ఆ పరంపరను కొనసాగిస్తూ నేటికీ నిత్యకళ్యాణోత్సవంలో అన్నమయ్య వంశీయులే కన్యాదాతగా వ్యవహరిస్తున్నారు.

అంతేగాకుండా, ఉగాది, శ్రీరామనవమి, ఆణివార ఆస్థానాలయందు, వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, పుష్పయాగం వంటి సేవలలోనూ ఈ వంశీయులు పాల్గొని ఘనంగా సత్కరించబడుతున్నారు. శ్రీనివాసునికి అన్నమయ్య మనసా, వాచా, కర్మణా సమర్పించుకున్న సేవల ఫలితంగా, గత ఆరు శతాబ్దాలుగా వారి వంశస్థులందరూ శ్రీవారి సేవలో తడిసి ముద్దవుతున్నారు. ఈనాటికీ వారి వారసులే సుప్రభాత సమయంలో మేలుకొలుపు మొదలుకొని, ఏకాంతసేవలో జోలపాట వరకు పాడుతారు. ఆశ్రితపక్షపాతి అయిన శ్రీ వేంకటేశ్వరుని కటాక్షంతో అన్నమాచార్యుని వంశీయులందరికీ ఆచంద్రతారార్కం ఈ భాగ్యం లభిస్తూనే ఉంటుంది.

Share this post with your friends