జనవరి 10 నుంచి తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. వచ్చే జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉండటంతో జనవరి 10 నుంచి 19వ తేది వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ కల్పించనుంది. ఇందుకు నలభై రోజులు మాత్రమే ఉండటంతో సన్నద్ధం కావాలని ఆయా శాఖల అధికారులందరినీ అడిషనల్ ఈఓ ఆదేశించారు.

ఈ పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశికి సరిపోయే పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్‌లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు

ఈ పది రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు (ప్రోటోకాల్ వీఐపీలు మినహా) రద్దు

⁠జనవరి 10 నుండి 19వ తేది వరకు వరకు 10 రోజుల పాటు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు.

జనవరి 09 నుండి 19 వరకు ఆర్జిత సేవలు రద్దు

జనవరి 10న స్వర్ణ రధం ఊరేగింపు, 11న చక్ర స్నానం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేయబడుతుంది.

Share this post with your friends