దసరా నవరాత్రులు లేదా శరన్నవరాత్రులను భారతదేశం అంతటా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం దసరా మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ ఏడాది దసరా ఉత్సవాలు అక్టోబర్ 3న ప్రారంభమై అక్టోబర్ 12న ముగియనున్నాయి. ఘట స్థాపనతో ఈ ఉత్సవాలను ప్రారంభించి దసరా నాడు ముగిస్తారు. దీనికోసం ఇంద్రకీలాద్రి పెద్ద ఎత్తున ముస్తాబవుతోంది. ఈసారి దసరా మహోత్సవాలకు సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకరణల్లో దర్శనమిచ్చే కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు దాదాపు 14 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. సామాన్య భక్తుల కోసం సర్వ దర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు అన్ని దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అయితే వీఐపీ, ప్రోటోకాల్ కారణంగా సామాన్య భక్తులకు ఇబ్బంది తలెత్తేది. ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీలకే ఓ సమయాన్ని కేటాయించబోతున్నారు. ఆ సమయంలో మాత్రమే వీఐపీలు అమ్మవారి దర్శనానికి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొన్నటి వర్షాలకు విరిగిపడిన కొండచరియలను తొలగించే పనిలో అధికారులు ఉన్నారు.