
చంద్రవంశానికి చెందిన పురూరవ చక్రవర్తికి ఊర్వశి ద్వారా “ఆయువు” అనే కుమారుడు పుట్టాడు. ఆయువుకు నహుషుడు అనే కుమారుడు జన్మించాడు. నహుషుడు ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పాలించేవాడు. ఒక రోజు గంగా-యమునా సంగమంలో చేపలు పడుతున్న మత్స్యకారుల వలకు, 12 సంవత్సరాలుగా నీటిలో సమాధి స్థితిలో తపస్సు చేస్తున్న చ్యవన మహర్షి చిక్కుకున్నారు. వారు భయంతో, పశ్చాత్తాపంతో క్షమాపణలు కోరగా, చ్యవనుడు.. “నేను ఇన్నాళ్లు చేపలతోనే జీవించాను. ఇప్పుడు వాటితో పాటు నన్నూ అమ్మేయండి” అన్నాడు. జాలరులు అయోమయంలో నహుషుని వద్దకు వెళ్లగా, రాజు వినయంతో మునికి క్షమాపణలు తెలిపాడు.
అయితే చ్యవనుడు అదే మాట పునరావృతం చేశాడు: “చేపలతో పాటు నన్నూ తగిన వెలకు అమ్మండి.” నహుషుడు మొదట వేయి మాడలు, తరువాత లక్ష మాడలు, తరువాత కోటి మాడలు చెప్పినా చ్యవనుడు సంతృప్తి చెందలేదు. చివరికి రాజ్యం సగం, ఆపై మొత్తం రాజ్యమూ సమర్పిస్తానన్నా ముని ఒప్పుకోలేదు. చివరికి గవిజాత ముని వచ్చి రాజుకు : “బ్రాహ్మణుడు, గోవు ఇద్దరూ సమాన విలువ కలవారు. బ్రాహ్మణుడు మంత్రాలకు అధిష్టానం, గోవు హవిస్సుకు మూలం. అందువల్ల గోవే చ్యవన మహర్షికి సరియైన వెల” అని ఉపదేశించాడు. ఆచరణలోకి దింపిన నహుషుడు, గోవును సమర్పించాడు.
అప్పుడు చ్యవన మహర్షి ఆనందంతో.. “రాజా! గోవు అగ్నిమయం, అమృత స్వరూపం, స్వర్గానికి సోపానం. దేవతలకే పూజ్యనీయమైనది. నాకిదే తగిన మూల్యం.” అని తెలిపాడు. ఈ విధంగా గోమాత గొప్పదనం వెలుగుచూసింది.
