తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని పాలజ్ గ్రామాన్ని మరో రెండు గ్రామాలు కూడా అనుసరిస్తున్నాయి. ఆ గ్రామం మరోదో కాదు.. నిజామాబాద్ జిల్లా తానూరు మండలం భోసి గ్రామస్తులు సైతం 1963లో కర్ర గణపతిని ప్రతిష్టించి పూజిస్తున్నారు. ఈ కర్ర గణపతిని చెక్కింది కూడా కళాకారుడు గుండాజీ వర్మే కావడం విశేషం. ఇక్కడి గ్రామస్తులు గణపతి దీక్షను చేపడుతుంటారు. ఇక్కడి వినాయకుడిని దర్శించుకుంటే కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్నట్టేనని గ్రామస్తుల నమ్మకం. ఇక్కడి కర్ర గణపతికి మొక్కి ముడుపు కడితే చాలు తప్పక మన కోరిక నెరవేరుతుందట. పాలజ్, భోసి గ్రామాల బాటలోనే చిక్లీ, తానూర్ అనే గ్రామాలు కూడా నడుస్తున్నాయి.
చిక్లీలోనూ కర్ర వినాయకుడే మనకు దర్శనమిస్తాడు. ఇక్కడి యువకులు ఈ కర్ర వినాయకుడికి కారణంగా ప్రభుత్వోద్యోగాలు సాధించారట. గ్రామం అంతా సుభిక్షంగా ఉందట. భోసిలో ఏకంగా 450 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఈ పాలజ్, తానూర్, చిక్లీ, బోసి గ్రామాలున్నాయి. ఈ గణనాథులకు నిమజ్జనం ఉండదు. 11 రోజుల పాటు పూజించి 11వ రోజున శోభా యాత్ర నిర్వహించి విగ్రహంపై నీళ్లు చల్లి భద్రపరుస్తారు. ఇక ఈ శోభాయాత్ర డీజేలు, హరి కీర్తనలు వంటివేమీ లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ప్రతి రోజూ బ్రహ్మ ముహుర్తాన స్వామి వారి కాకడ హారతి, మధ్యాహ్నం గీత ప్రవచనం, రాత్రి కీర్తనలు, జాగరణలు, భజనలు వంటివి ఉంటాయి.