పూరి జగన్నాథుడి ఆలయంలో మరో ఆసక్తికర విషయం బైసి పహచా..

పూరీ క్షేత్రం గురించి.. పూరి జగన్నాథుడి గురించి ఇప్పటికే మనం ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. ఎంత చెప్పుకున్నా ఏదో ఒక అంశం పూరి జగన్నాథుడి గురించి మిగిలిపోతూనే ఉంటుంది. ఇంకా ఏం మిగిలిపోయిందంటారా? జగన్నాథుడి ఆలయ మెట్ల అంశం. జగన్నాథుడి ఆలయంలో 22 మెట్లు ఉంటాయి. ఈ మెట్లను ‘బైసి పహచా’ అని పిలుస్తారు. ఒది ఒక ఒరియా పదం. బైసి పహచా అంటే ఏమీ లేదు.. 22 మెట్లు అని అర్థం. ఈ మెట్లను చరిత్రకారులు, పండితులు ఎవరికి తోచిన విధంగా వారు వర్ణించారు. దీనికి తోడు జగన్నాథ జానపద సంస్కృతి సైతం పురాణాలు, గ్రంథాల్లో కూడా పేర్కొనడం జరిగింది.

ఎంతమంది ఏం చెప్పినా కూడా అంతిమంగా మాత్రం ఒక సానుకూల అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారు. అసలు ఈ బైసి పహచాకి సంబంధించిన ఆసక్తికర విషయాలేంటంటే.. పురాణ నమ్మకాల ప్రకారమైతే ఈ మెట్ల సంఖ్య 22 కానీ.. ప్రస్తుతం మాత్రం మనకు 18 మెట్లు మాత్రమే కనిపిస్తాయి. ఈ 18 మెట్లకు అనాద్ బజార్ మెట్లు రెండు, వంట గది దగ్గర రెండు మెట్లు కలిపితే మొత్తం 22 అవుతుందని కొందరు పండితులు చెబుతారు. ఈ మెట్ల ఎత్తు, వెడల్పు 6 అడుగులు కాగా.. పొడవు దాదాపు 70 అడుగులు ఉంటుంది. ఈ మెట్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends