
తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న శ్రీ వకుళా మాత ఆలయంలో ఆదివారం వార్షికోత్సవ ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటలకు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షబంధనం, అగ్ని ప్రతిష్ట, కలశారాధన, మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ఉత్సవర్లకు అష్టోత్తర కలశాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, విజిఓ శ్రీ బాలిరెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అమ్మవారికి బంగారు కవచాలు..
పాతకాల్వకు చెందిన శ్రీ ఉంగరాల సుబ్రహ్మణ్యం అనే భక్తుడు రూ.1.24 లక్షల విలువైన బంగారు పూత పూయబడిన కవచాలను వకుళమాత అమ్మవారికి ఆదివారం విరాళంగా అందించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మికి ఆలయంలో దాత ఈ కవచాలను బహుకరించారు.
