ఇక్కడి ఆంజనేయ స్వామి శారీరక, మానసిక సమస్యలను పోగొడుతాడట..

ఒంటిమిట్ట గురించి తెలియని ఎవరికి? అయితే ఇక్కడ రామయ్య కొలువుదీరాడని అందరికీ తెలుసు కానీ ఆంజనేయ స్వామివారి గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. శ్రీ ఆంజనేయస్వామివారు సంజీవరాయడుగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడి చెరువు కట్ట మీద కూడా ఆంజనేయస్వామివారు కొలువై ఉన్నారు. ఇక్కడి వారందరినీ నీటి వల్లగానీ, వరిపొలాల్లో తిరుగుతున్నపుడు గానీ, ఈ బాటలో యాత్ర చేస్తున్నప్పుడు గానీ ఎలాంటి ప్రాణభయం కలగకుండా కాపాడుతూ ఉంటాడట. ఇక్కడి స్వామివారు శారీరక, మానసిక రోగాలను పోగొడుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు.

సంజీవరాయని ఆలయ పురాణ ప్రాశస్త్యం..

ఒంటిమిట్ట గుడిలో సీతాలక్ష్మణ సమేతుడై కోదండం ధరించి శ్రీరామచంద్రుడు దర్శనమిస్తాడు. వాస్తవానికి ఈ ఆలయంలో ఆంజనేస్వామి ఉండడు. దీనికి కారణమేంటంటే.. ఆలయంలోని సీతారాములు అరణ్యకాలం నాటి వారట. అప్పటికి ఇంకా శ్రీరామచంద్రుని దర్శనం హనుమంతునికి కాలేదు కాబట్టి గుడిలో ఆంజనేయస్వామి లేడని చెబుతారు. రామాలయం అంటే భూమికి దిగిన వైకుంఠమని, రాముని బంటును కావున ఎదురుగా ఉండి సేవ చేసుకుంటానని ఆంజనేయస్వామి చెప్పినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఒంటిమిట్ట గుడికి ఎదురుగా సంజీవరాయడుగా కొలువుదీరి ఉన్నాడు.

Share this post with your friends