తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు బుధవారం ఉదయం హనుమంత వాహన సేవలో టీటీడీ హిందూ ధర్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సంప్రదాయ కళలను చక్కగా ప్రదర్శించారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్నాటక, , మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు, తొమ్మిది రాష్ట్రాల నుంచి 18 కళా బృందాలు, 468 మంది కళాకారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే భరతనాట్యం, హైదరాబాదుకు చెందిన జానకి బృందం ఆధ్వర్యంలో కరియా నృత్యం, విశాఖపట్నంకు చెందిన సురేఖ బృందం ప్రదర్శించిన మహిషాసుర మర్ధిని నృత్యం వీక్షకులను కట్టిపడేసింది. కర్నాటకకు చెందిన జ్యూతి హెగ్డే గీతా గోవిందం నృత్యం, ఇందు బృందం ప్రదర్శించిన ఆంజనేయ నమనం నేత్రపర్వంగా సాగింది.
మహారాష్ట్రకు చెందిన కళా బృందం ప్రదర్శించిన మరాటీ నృత్యం, పంజాబ్ కు చెందిన గోవిందమ్మ బృందం ప్రదర్శించిన పంజాబీ నృత్యం, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఉమాశంకర్ బృందం ప్రదర్శించిన బసంతరాస్ అనే జానపద కళ, బెంగాల్ కు చెందిన పార్థసారథి బృందం ప్రదర్శించిన బెంగాల్ నృత్యం, తిరుపతికి చెందిన డాక్టర్ గాయత్రీ బృందం ప్రదర్శించిన శ్రీరామ పట్టాభిషేక ఘట్టం ఆకట్టుకున్నాయి. కడపకు చెందిన విజయశాంతి బృందం ప్రదర్శించిన భరతనాట్యం, తమిళనాడుకు చెందిన ధనలక్ష్మి, పాకాలకు చెందిన లీలారాణి, అనకాపల్లికి చెందిన కె.పార్వతి, కోలాటం, రైల్వేకోడూరుకు చెందిన సుజన కోలాటం, నెల్లూరుకు చెందిన ఆర్.శ్యాలినీరాణి, విశాఖపట్నంకు చెందిన కె.సుజాత, తిరుమలకు చెందిన డి.శ్రీనివాసులు బృందాలు ప్రదర్శించిన కోలాటాలు తీరు మనోహరంగా భక్తులను ఓలలాడించాయి.